శివసేన ఎంపీ పై సంచలన ఆరోపణలు చేసిన నవనీత్ కౌర్


0
navneet kaur

శివసేన ఎంపీ అరవింద్ సావంత్ మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో మాట్లాడితే తనపై యాసిడ్‌ పోస్తానని, జైలుకు పంపుతానని బెదిరించాడని నటి, అమరావతి స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రానా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు.

‘శివసేన పార్లమెంట్ సభ్యుడు అరవింద్ సావంత్ బెదిరించారు.. ఇది కేవలం నాకు జరిగిన అవమానం మాత్రమే కాదు, దేశంలోని మహిళలందరికీ జరిగిన అవమానం.. అరవింద్ సావంత్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి’ అని నవనీత్ కౌర్ డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల గురించి పార్లమెంట్‌లో ప్రస్తావించడం పట్ల సావంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు నవనీత్ కౌర్ పేర్కొన్నారు. ‘నువ్వు మహారాష్ట్రలో ఎలా తిరుగుతావో చూస్తా… నిన్ను జైల్లో వేసి నీ చేత ఊచలు లెక్కబెట్టిస్తాం’ అని అరవింద్‌ సావంత్‌ తనను లోక్‌సభ లాబీలో బెదిరించినట్లు తెలిపారు. ‘ఆయన మాటలకు నాకు మతిపోయినట్లయ్యింది. ఒక్కసారిగా సావంత్‌వైపు తిరిగాను.. నా పక్కనే మరో ఎంపీ ఉన్నారు.. ‘సావంత్‌ మాటలను మీరు విన్నారా’ అని ఆయనను అడిగితే.. ‘విన్నాను’ అని చెప్పారు’ అంటూ నవనీత్ తాను ఎదుర్కొన్న బెదిరింపుల ఘటనను వివరించారు.

ముకేష్‌ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలిపిన కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం సచిన్‌ వజేని సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై లోక్‌సభలో వాడీవేడి చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో నవనీత్‌ కౌర్‌ రానా లోక్‌సభలో ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘‘మాజీ పోలీసు కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ అవినీతి ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా చేయాలి’’ అని డిమాండ్‌ చేశారు. అయితే సావంత్‌ నవనీత్‌ వ్యాఖ్యలని ఖండించారు. ఆమె చేసే ఆరోపణలన్ని అవాస్తవలన్నారు. అంతేకాక సీఎం ఠాక్రే గురించి మాట్లాడేటప్పుడు ఆమె అంత దూకుడుగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నించారు.


Comments

comments