కథ :
చెవిటి, మూగ అమ్మాయైన సాక్షి(అనుష్క) మంచి పెయింటర్. ఆంటోనీ (మాధవన్) సెలబ్రిటీ మ్యుజీషియన్, మిలియనీర్ అయిన అంటోనీ, సాక్షి ప్రేమలో పడతారు. ఎంగేజ్మెంట్ జరిగిన తరవాత వీరిద్దరూ కలిసి సరదాగా ట్రిప్‌కు వెళ్తారు. ఈ ట్రిప్‌లో భాగంగా భూతాల కొంపగా పేరొందిన ఒక పాత ఇంటికి వీరిద్దరూ వెళ్తారు. అయితే ఆ ఇంట్లోనే 1972లో భార్యాభర్తలు పీటర్, మెలిసా హత్యకు గురవుతారు. అప్పటి నుంచి ఆ బంగ్లా అంటే అందరికీ హడల్. కానీ సాక్షి ఆ విల్లా ఓనర్ జోసెఫ్ వేసిన ఓ పెయింటింగ్ వేయాలని అనుకోవడంతో సాక్షి, ఆంటోనీ అక్కడికి వెళ్తారు. వెళ్లిన కొంతసేపటికి ఆ ఇంట్లో ఆంటోనీ హత్యకు గురవుతాడు. సాక్షి మాత్రం గాయాలతో బయటపడుతుంది. ఆ తరువాత సాక్షి పోలిసుల దగ్గరకు వెళ్తుంది. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది ? ఆంటోనీని ఎవరు చంపారు? మూగ అమ్మాయి అయిన సాక్షి పోలీసులకు ఆ విషయాన్ని ఎలా చెప్పింది ? పోలీస్ కెప్టెన్ రిచర్డ్ (మైకేల్ మ్యాడ్సన్), డిటెక్టివ్ మహా అలియాస్ మహాలక్షీ(అంజలి) కేసును ఎలా చేధించారు. సాక్షి ప్రాణ స్నేహితురాలు సోనాలి(షాలిని పాండే) ఏమైంది అనే విషయాలు తెలియాలంటే సినిమాను వీక్షించాల్సిందే.
నటీనటుల పనితీరు :
దివ్యాంగురాలి పాత్రలో అనుష్క బాగానే నటించింది. చెవిటి, మూగ అమ్మాయిగా అనుష్క పాత్ర మొత్తం సైన్ లాంగ్వేజ్‌తోనే సాగుతుంది. ఇలాంటి విభిన్నమైన పాత్రను చేయడానికి అనుష్క ధైర్యం చేయడం అభినందనీయం. అలాగే క్లిష్టమైన కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కొన్ని హారర్ అండ్ ఎమోషనల్ సీన్స్ లోనూ అనుష్క పలికించిన హావభావాలు చాల బాగున్నాయి. ఇక మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్సేన్ కూడా చాలా మంచి పాత్రలో నటించాడు. డిటెక్టివ్ పాత్రలో అంజలి న్యాయం చేసింది. షాలిని పాండే, సుబ్బరాజ్ పాత్రలకు సెకండాఫ్‌లోనే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. మొత్తానికి వారికి మంచి పాత్రలు దక్కాయి. అవసరాల శ్రీనివాస్ పెద్దగా అవసరం లేని పాత్రలోనే కనిపించాడని చెప్పాలి.
సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు హేమంత్ మధుకర్ కథను చాలా క్రియేటివ్‌గా రాసుకున్నారు. ఫస్టాఫ్ ఆసక్తిని కలిగిస్తుంది. కానీ సెకండాఫ్ లో మాత్రం సినిమా ఇరవై నిమిషాల ముందే ట్విస్ట్ రివీల్ చేసేయడంతో దీంతో ప్రేక్షకులకు కిక్కు మిస్సవుతుంది. ఇక ఆ తరవాత జరిగే కథ అంతా ఊహాజనితమే. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ముఖ్యంగా హారర్ సన్నివేశాల్లో సీన్ లోని మూడ్ ని తన కెమెరా యాంగిల్స్ తో కళ్ళకు కట్టినట్టు చూపించారు కెమెరామెన్. అలాగే గిరీష్ అందించిన నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంది. అలాగే, గిరీష్ గోపాలక్రిష్ణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో ప్లస్. ఇక ఎడిటింగ్ కూడా బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకున్నాయి. గోపీ సుందర్ అందించిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘నిన్నే నిన్నే’ సాంగ్ చాలా బాగుంది.
తీర్పు
ఓవరాల్ గా థిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి, అనుష్క అభిమానులకి ఈ సినిమా నచ్చుతుంది. మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చడం కష్టమే