కరోనా విలయతాండవం చేస్తున్న ముంబై నగరాన్ని కొన్ని రోజులుగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మహానగరంలో పెద్ద వృక్షాలు సైతం నేలకొరుగుతున్నాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నివాసం ఉండే ‘ప్రతీక్ష’లో కూడా ఓ గుల్ మొహర్ చెట్టు వేళ్లతో సహా పెకలించుకుని కూలిపోయింది. దాంతో ఆయన ఎంతో ఆవేదన చెందారు. ఆ చెట్టుతో పెనవేసుకున్న తన అనుబంధాన్ని అక్షరాల రూపంలో వెల్లడించారు.
"మా కుటుంబంతో 43ఏళ్ల అనుబంధం ఉన్న గుల్ మెహర్ చెట్టు ఇన్నేళ్లు మాకు ఎన్నో సేవలందించి నేడు స్వచ్ఛందంగా తలవాల్చింది. ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు నాటిన మొక్క.. చెట్టుగా మారి మాకు ఆనందాన్ని పంచింది. మా ఇంట్లో ఏ పండుగ, శుభకార్యం, వేడుకలన్నీ ఆ చెట్టు కిందే జరిగాయి. అభిషేక్ – ఐశ్వర్య పెళ్లి కూడా ఆ చెట్టు కిందే జరిగింది. మా పిల్లలు కూడా ఆ చెట్టు నీడలోనే ఆడుకుని పెరిగి పెద్దవాళ్లయ్యారు. ఇంతటి అనుబంధాన్ని మాతో పెనవేసుకున్న ఆ చెట్టు ఈరోజు నేలకొరగడం మనసును ఎంతో బాధ కలిగిస్తోంది. ఎన్నో మధురానుభూతులను పెనవేసుకున్న ఆ చెట్టు కొమ్మలు నేలకొరిగిన క్షణాన ఇంట్లో పెద్దవాళ్లు పోయినంత బాధ కలుగుతోంది" అని తన ఆవేదన పంచుకున్నారు. ప్రస్తుతం బిగ్ బీ పోస్టుకి నెటిజన్ల నుంచి ఆత్మీయ పలకరింపు వస్తోంది.
అమితాబ్ తండ్రి, ప్రముఖ కవి హరివంశ్ రాయ్ బచ్చన్ రాసిన ఓ కవిత పేరు ‘ప్రతీక్ష’. అదే పేరును అమితాబ్ తన నివాసానికి పెట్టుకున్నారు.