కథ
ఆధిత్య అరుణాచలం (రజినీకాంత్) ముంబయిలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఎవరిమాట వినకుండా, చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరించే అరుణాచలం ఎవరైనా తప్పు చేస్తే చంపడమే తన లక్ష్యంగా ముందుకు సాగుతుంటాడు. ఆధిత్యను రాజకీయ నాయకుల ఒత్తిడి వలన అధికారులు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ క్రమంలో ముంబయి నుండి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయిన అరుణాచలం అక్కడ చాలా పెద్ద క్రైమ్‌ను వెలికి తీస్తాడు. దాని గుట్టు లాగితే చాలా పెద్ద తలకాయలు ఉన్నాయని తెలుసుకుంటాడు. ఆ కేసును ఛేదించే క్రమంలో అరుణాచలం తన ప్రాణానికి ప్రాణమైన కూతురు వల్లి(నివేదా థామస్) ని కోల్పోతాడు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఉన్న ఆదిత్య ఒక బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ గా మారి విదేశాల్లో కూర్చొని చక్రం తిప్పుతున్న హరి చోప్రా (సునీల్ శెట్టి) ని ఎలా మట్టుబెట్టాడు? రజినీ జీవితంలోకి లిల్లీ ఎలా వస్తుంది అనేది ఈ చిత్రం కథ.
నటీనటులు ప్రదర్శన
సూపర్ స్టార్ రజినీకాంత్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆధిత్య అరుణాచలం పాత్రలో దుమ్ముదులిపే పెర్ఫార్మన్స్ తో ఆయన అభిమానులకు విందు భోజనం అందించాడు. ఈ సినిమాలో రజినీ స్టైల్, మ్యానరిజమ్స్ ఫ్యాన్స్ నే కాక సామాన్య ప్రేక్షకులను కూడా నచ్చుతాయి. రజినీకాంత్ దర్బార్ చిత్రంలో చూడటానికి చాలా యంగ్ గా ఉన్నాడు, అలాగే డ్యాన్సుల్లో, ఫైట్స్ లో కూడా చాలా యాక్టివ్ గా కనిపించాడు. . కాని హీరోయిన్‌తో రొమాన్స్ విషయంలో మాత్రమే కాస్త వెనుకబాటు అని చెప్పుకోక తప్పదు. లేడీ సూపర్ స్టార్ నయనతార చూడటానికి బాగుంది. అయితే ఆమెకు పెర్ఫార్మన్స్ కు ప్రాధాన్యత ఉండే పాత్ర దక్కలేదు. రజినీ తర్వాత నివేద థామస్ కు చాలా మంచి పాత్ర పడింది. స్వతహాగా మంచి నటి అవ్వడం వల్ల ఎమోషనల్ సీన్స్ లో కూడా మెప్పించింది. ఇక యోగి బాబు కామెడీతో నవ్వించాడు. విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి ఆకట్టుకున్నాడు. ఇక మిగిలిన వారు వారి పాత్రల పరిధిలో నటించి
ఆకట్టుకున్నారు.
సాంకేతిక విభాగం
సూపర్ స్టార్ తో మొదటిసారి సినిమా చేస్తున్న మురుగదాస్ సాధారణ రివెంజ్ డ్రామా కథనే ఎన్నుకున్నాడు. అయితే దీనికి తనదైన శైలి కథనాన్నిజోడించాడు. కొన్ని సీన్స్ లో మురుగదాస్ ప్రతిభ కనపడుతుంది. ముఖ్యంగా అజయ్ మల్హోత్రాను బయటకు రాబట్టే సన్నివేశం మురుగదాస్ చమక్కుల్లో ఒకటి. ఫస్ట్ హాఫ్ పూర్తి రేసిగా ఉండగా, సెకండ్ హాఫ్ లో అసలు కథ చెప్పే చోట నెమ్మదిస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ పెద్దగా మెప్పించవు. అనిరుద్ అందించిన పాటలు యావరేజ్ గా ఉన్నాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరంగా మెప్పించాడు. ముఖ్యంగా ఎలివేషన్ కోసం వాడుకున్న ర్యాప్ భలేగా వర్కౌట్ అయింది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ప్రతి సీన్ లో సినిమాటోగ్రాఫర్ ప్రతిభ కనపడుతుంది. ఎడిటింగ్ మరింత పదునుగా ఉండాల్సింది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ల్యాగ్ ఉన్నాయి. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.
ఆఖరి మాట : దర్బార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కు బాగా నచ్చుతుంది, మిగిలిన వారు రొటీన్ సినిమా అని చెప్పే అవకాసం ఉంది.
రేటింగ్ : 3/5