కథ
మహి(రాజ్ తరుణ్), వర్ష(షాలిని పాండే) ఒకే రోజు ఊటీలోని హాస్పిటల్లో పుడతారు. చిన్ననాటి స్నేహితులుగా పెరిగిన వీరద్దరూ తర్వాత అనుకోకుండా విడిపోతారు. పెద్దైన వర్ష (షాలిని పాండే) సినిమాల్లో కథానాయికగా రాణించాలని కలలు కంటుంటుంది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆమెకు అవకాశాలు మాత్రం రావు. మహి పెద్ద ఫొటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకుని ఉంటారు. ఓ సందర్భంలో వీరిద్దరూ కలుసుకుంటారు. వర్షను సులభంగా గుర్తు పట్టిన మహి ఆమెకు సంబంధించిన విషయాలను గుర్తు చేస్తాడు. ఫేమస్ ఫొటోగ్రాఫర్ కావడంతో తను వర్షకు చేసిన ఫోటోషూట్‌తో అవకాశాలు కూడా వస్తాయి. క్రమంగా ఇద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది. చిన్నప్పటి నుండి ఇద్దరి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారే క్రమంలో కథలో అనుకోకుండా పెద్ద కుదుపు జరుగుతుంది. వర్ష, మహి ప్రయాణం ఎటువైపు దారి తీసింది? చివరికి
ఇద్దరూ ఒక్కటయ్యారా లేదా? మహికి చిన్నప్పటి నుండి ఉన్న సమస్య ఏంటి? దానివల్ల ఎటువంటి పర్యవసానాలు ఎదురవుతాయి అన్నది చిత్ర కథ.
నటీనటుల ప్రదర్శన
ఉయ్యాలా జంపాల సినిమా నుండి అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడి పాత్రల్లో కనిపించిన రాజ్ తరుణ్ ఈ సినిమాలో మహిగా కాస్త కొత్తగా కనిపించే ప్రయత్నం చేశాడు. సినిమా మొత్తం చాలా కాంగా సేటిల్డ్ నటన కనబరిచాడు. కీలకమైన ఎమోషన్స్ ను పండించడంలో రాజ్ తరుణ్ ఆకట్టుకున్నాడు. వర్ష పాత్రలో షాలిని పాండే తనదైన నటనతో ఆకట్టుకుంది. రాజ్ తరుణ్ షాలిని ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. హీరోయిన్ కి మదర్ గా నటించిన రోహిణి ఎప్పటిలాగే తన ఎమోషనల్ నటనతో ఆకట్టుకుంది. అలాగే మరో కీలక పాత్రలో నటించిన నాజర్, మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. హీరో, హీరోయిన్లకు చిన్న పిల్లల
పాత్రల వేసిన వారి నటన ఆకట్టుకుంటుంది.
సాంకేతిక విభాగం
దర్శకుడు జి.ఆర్.కృష్ణ తీసుకున్న కథలో కొత్తదనం ఏది లేదు. కథ పాతదైనా కథనం ఆసక్తికరంగా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు కానీ ఈ సినిమాలో అదే కరువైంది. కథనం నత్తనడకన నడుస్తుంది. లవ్‌లోని బలమైన ఎమోషన్స్‌ను క్యూట్‌గా చూపించడంలో దర్శకుడు తడబడ్డాడు. స్లో స్క్రీన్ ప్లేతో బోరింగ్ ట్రీట్మెంట్ తో సినిమా బోర్ కొడుతోంది. మిక్కి జె.మేయర్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. ఇక సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీతో ప్రతి సన్నివేశాన్ని విజవల్గా రిచ్‌గా చూపించారు. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. లొకేషన్స్ అదిరిపోయాయి. ఊటీ అందాల్ని బాగా చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
రాజ్ తరుణ్ మేకోవర్
షాలినీ పాండే నటన
కెమెరా వర్క్
మైనస్ పాయింట్స్
రొటీన్ ప్రేమ కథ
స్క్రీన్ ప్లే
ఎడిటింగ్
చివరి మాట : ఎమోషనల్ లవ్ స్టోరీ కథాంశంతో వచ్చిన ఈ ‘ఇద్దరి లోకం ఒకటే’ ఆసక్తి కలిగించని ఒక పూర్ లవ్ స్టోరీగా నిలిచిపోతుంది.
రేటింగ్ : 2.5/5