కథ
బాబు మోహన్ అలియాస్ బాబు(శ్రీసింహా) డెలివరీబాయ్‌గా పనిచేస్తుంటాడు. తన స్నేహితులు అభి(నరేష్ అగస్త్య), ఏసు(సత్య)లతో కలిసి ఓ మురికివాడలో అద్దెకుంటాడు. నెలంతా కష్టపడినా జీతం సరిగా రాకపోవడంతో బాబు ఉద్యోగం మానేయాలని అనుకుంటాడు. తన స్నేహితుడు ఏసు ఇచ్చిన సలహాతో డెలివరీ ఇస్తూ తెలివిగా కస్టమర్స్ ను మోసం చేసి డబ్బు సంపాధించాలని నిర్ణయించుకుంటాడు. ఒకరోజు సరుకు డెలివరీ ఇవ్వడానికి ఓ రిచ్చెస్ట్ అపార్ట్మెంట్ కి వెళ్తాడు. అయితే అక్కడ బాబు అనుకోకుండా ఓ మర్డర్ చేస్తాడు. ఆ హత్యానేరం నుంచి బయటపడటానికి తన స్నేహితులతో కలిసి అదే ప్రదేశానికి వెళ్లిన బాబుకు అక్కడ ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి?బాబు నిజంగా ఆ హత్యచేశాడా? అసలు ఆ మర్డర్ మిస్టరీ వెనకున్న రహస్యం ఏమిటి? డ్రగ్ డీలర్ మైరా(అతుల్య చంద్ర), రవి(వెన్నెల కిషోర్)లతో బాబు స్నేహితుడు అభికి ఉన్న సంబంధమేమిటి? అలాగే వీరి కథకు మత్తువదలరా టైటిల్ కి ఉన్న సంబంధం ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల ప్రదర్శన
కీరవాణి కొడుకు శ్రీ సింహ హీరోగా మొదటి సినిమాలోనే పరిణితితో కూడిన నటనను కనబరిచాడు. చాలీచాలని జీతంతో ఇబ్బంది పడే మంచి స్వభావం ఉన్న ఒక డెలివరీ బాయ్ గా నేచురల్ నటనతో, ఫేస్ ఎక్సప్రెషన్స్ తో ఇరగదీసాడు. మర్డర్ చేసానని పొరబడినప్పుడు, తెలియకుండా డ్రగ్స్ కలిపిన వాటర్ తాగి డ్రగ్స్ మత్తులోకి వెళ్ళినప్పుడు, సత్య, నరేష్ తో కలిసి ఉన్న కాంబో సీన్స్ లోను శ్రీ సింహ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఏసు పాత్రలో కనిపించిన కమెడియన్ సత్య తన కామెడీ టైమింగ్ తో సినిమా మొత్తం తన భుజాల పై మోసాడు. దొంగతనం కాదు, తస్కరించడం అని చెప్పిన డైలాగ్స్ కి థియేటర్స్ లో పడి పడి నవ్వాల్సిందే. ఇక మరో మెయిన్
కేరెక్టర్ నరేష్ అగస్త్య కూడా రూమ్ మేట్ గా ఫ్రెండ్లీగా ఉంటూనే.. ఫ్రెండ్స్ కి వెన్నుపోటు పొడిచే కేరెక్టర్ లో అద్భుతమైన నటన కనబర్చాడు. డ్రగ్స్ తయారుచేసే వ్యక్తిగా వెన్నెలకిషోర్ పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో నవ్విస్తుంది. పావలా శ్యామల, అతుల్య చంద్ర, విద్యుల్లేఖా రామన్, బ్రహ్మాజీ ఇలా మిగిలిన పాత్రధారులందరూ చక్కగా నటించారు.
సంకేతిక విభాగం
మొదటి సినిమాతోనే దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించాడు రితేష్‌రానా. తొలి సినిమా అయినా ఎక్కడ తడబాటు లేకుండా ఒక్క నిమిషం బోర్ కొట్టకుండా సినిమాను నడిపించారు. చేతిలో పైసా లేని బీదరికంలో ఉన్న కుర్రాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో.. అవసరం ఎలాంటి పనైనా చేపిస్తుంది అనే విషయానికి కామెడి టచ్ ఇచ్చాడు దర్శకుడు. సినిమాలో సత్య కామెడీ, ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు సెకెండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు అలరిస్తాయి. కీరవాణి కొడుకు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమాకి హైలెట్ గా చెప్పుకోవచ్చు. సిచ్యూవేషన్‌కు తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్లో వేరియేషన్స్ చూపిస్తూ కొత్త తరహా మ్యూజిక్ అందించారు. సాధారణంగా థ్రిల్లర్ సినిమాలకు నేపథ్య సంగీతం ఆయువు పట్టు. అలాంటి నేపథ్య సంగీతం ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. సురేష్ సారంగం అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మరో అస్సేట్, ఎ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ వర్క్, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ అన్నీ బావున్నాయి. రన్ టైం 2.10 నిమిషాలే కావడంతో ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ అనిపించదు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.
చివరి మాట : క్రైమ్ కామెడీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన 'మత్తు వదలరా' సినిమా వైవిధ్యతను కోరుకునే ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది.
రేటింగ్ : 3.25/5