తమిళనాడులో ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రధానంగా రెండు పార్టీల మధ్య పోరు కనిపిస్తోంది. తాజాగా ప్రముఖ సినీ నటి రాధిక అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు శరత్ కుమార్ మీడియాకు వెల్లడించారు.
శరత్ కుమార్ సమత్తువ మక్కల్ కట్చి(ఎస్ఎంకే) అనే పార్టీని స్థాపించారు. దీనికి మహిళా విభాగం ఇంచార్జిగా రాధిక వ్యవహరిస్తున్నారు. ఈ పార్టీ 2011 నుంచి అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని వ్యవహరిస్తోంది. ఈ సారి రాబోయే ఎన్నికల్లో కూడా పొత్తుని కొనసాగించబోతున్నట్లు శరత్ కుమార్ ప్రకటించారు. పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నామని, గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. 2011లో కూడా ఈ పార్టీ అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయగా, తెంకాసి నియోజకవర్గం నుంచి శరత్‌కుమార్, నంగునేరి స్థానం నుంచి ఎ.నారాయణన్ ఎమ్మెల్యేలుగా స్థానాలు సంపాదించుకున్నారు.
అధికారంలో ఉన్న అన్నాడీఎంకే కూటమిలో పీఎంకే, బీజేపీ, ఎండీఎంకేతో పాటుగా మరికొన్ని చిన్న పార్టీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తమిళనాట కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రచారం చేపడుతున్నారు. మలి విడత ప్రచారానికి సిద్ధమయ్యారు. 14 నుంచి జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే..14వ తేదీ..ప్రధాని రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. దీంతో..రాహుల్ పర్యటనలో స్వల్పమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈనెల పదిహేను తర్వాత..రాహుల్ పర్యటన తేదీ ప్రకటించనున్నారు.