కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్త సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.
తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీనే ప్రత్యామ్నాయం అని మొదటిసారిగా చెప్పిన వ్యక్తిని తానేనన్నారు. 2019 సంవత్సరంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆ మేరకు స్టేట్ మెంట్ ఇచ్చానని గుర్తు చేశారు. ఇప్పటికీ ఎక్కడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని తెలిపారు. ఇదే సమయంలో తన అన్న, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బీజేపీలో చేరతారా? అని మీడియా ప్రతినిథులు అడగగా ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. అన్నదమ్ములుగా కలిసే ఉన్నప్పటికీ రాజకీయంగా ఎవరి అభిప్రాయాలు వారివే అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి పీసీసీ కోసం ప్రయత్నిస్తున్నారని, వారు ఎంతవరకు గెలుస్తారనేది కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ప్రజలు తీసుకునే నిర్ణయంపై రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ ప్రజల క్షేమం, ప్రజాస్వామ్యం కోసం పాటుపడాలని, తెలంగాణ ఆత్మశాంతి కలిగేలా కేసీఆర్ ప్రజలందరినీ కలుపుకుపోవాలని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో బీజేపీ తెలంగాణలో బలపడాలని స్వామివారిని కోరుకున్నట్టు చెప్పారు.