భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ ఎల్.మురుగన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి సమక్షంలో శివరామకృష్ణన్ చెన్నైలో కాషాయ కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సీటీ రవి ఆయనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వ కార్డును అందజేశారు.
అంతకుముందు సీనియర్ నటి, బీజేపీ మహిళా నాయకురాలు ఖష్బూ సుందర్ ఇద్దరు సన్నిహితులు, స్నేహితులు బీజేపీలో నేడు చేరనున్నారని సైతం ట్వీట్ చేశారు. వేంధార్ టీవీ మాజీ అధిపతి ప్రసన్న, అలగస్వామి, మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్‌లు నటి ఖుష్బూకు స్నేహితులు అని తెలిసిందే.
లక్ష్మణ్ శిరామకృష్ణన్ 1982, 83ల్లో భారత జట్టులో లెగ్ స్పిన్నర్‌గా ఉన్నారు. కెరీర్లో 9 టెస్ట్‌లు మ్యాచ్‌లు ఆడిన ఆయన 130 పరుగులు చేశారు. టెస్ట్ కెరీర్లో 24 వికెట్లు తీశాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 76 మ్యాచ్‌లు ఆడాడు శివరామకృష్ణన్. అందులో 1,802 పరుగులు చేశారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 254 వికెట్లు పడగొట్టారు. రిటైర్మెంట్ తర్వాత 2000 ఏడాది కామెంటెటర్‌గా కెరీర్ ప్రారంభించారు. పలు అంతర్జాతీయ మ్యాచ్‌లకు కామెంటెటర్‌గా సేవలు అందించారు. ఆయనను ఎల్ఎస్ అని లేక శివ అని పిలిచేవారు.