గన్నవరం టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గంలోని బావులపాడు మండలం మల్లవెల్లిలో ఎమ్మేల్యే ని గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామం లోని రావొద్దు అంటూ రోడ్డు పై గ్రామస్తులు బైఠాయించి నిరసన తెలిపారు.
మల్లవల్లిలో ఇళ్లస్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అధికారులు సమాచారం ఇచ్చారు. ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే వంశీ వస్తుండటంతో మల్లవల్లిలోని వైసీపీలోని ఓ వర్గం అడ్డుకుంది. పంపిణీకి కార్యక్రమం కోసం వెళ్లగా అక్కడ స్థానికుల నుంచి వంశీకి వ్యతిరేకత ఎదురైంది. వంశీ చేతుల మేదగా పట్టాలు తీసుకునేది లేదని తేల్చిచెప్పారు. వంశీని వెనక్కి వెళ్లాలంటూ మల్లపల్లి వాసులు నినాదాలతో హోరెత్తించారు.
దీంతో ఎమ్మెల్యే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గ్రామంలోకి భారీగా మోహరించారు. ఎమ్మెల్యే వంశీ అనుకూల, వ్యతిరేక వర్గీయుల నినాదాలతో మల్లపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బందోబస్తు కల్పించినప్పటికీ, గ్రామస్తుల నుంచి తీవ్ర ప్రతిఘటన రావడంతో ఎమ్మెల్యే వంశీ చేసేది లేక వెనుదిరిగి వెళ్లిపోయారు.