HomeTelugu politics

కమల్ కు షాకిస్తూ బీజేపీలో చేరిన ఎంఎన్‌ఎం ప్రధాన కార్యదర్శి
Published By :  Sushma Paidipalli Image Image
Kamal MNM leader Arunachalam leaves party and joins BJP
Friday Dec 25, 2020
కమల్ హాసన్ రాజకీయ పార్టీ మక్కల్‌ నీది మయ్యం​కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగైదు నెలలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ఎంఎన్ఎం పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం ఈ రోజు పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో  చేరారు.

కేంద్రమంత్రి ప్రకాశ్​ జావడేకర్​ సమక్షంలో శుక్రవారం(డిసెంబర్-25,2020)చెన్నైలోని బీజేపీ కార్యాలయంలో అరుణాచలం కాషాయ కండువా కప్పుకున్నారు. రైతులకు ఉపయోగకరంగా ఉన్నందున నూతన సాగు చట్టాలకు మద్దతివ్వాలని తాను కమల్​ను కోరానని అయితే వారి రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని వ్యతిరేకిస్తున్నారని ఈ సందర్భంగా అరుణాచలం విమర్శించారు. తూటికోరిన్‌ జిల్లాకు చెందిన అరుణాచలం తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో మక్కల్‌ నీది మయ్యం పార్టీకి పునాది వేయడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు ఆయన ఎంఎన్‌ఎంను వీడి బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. అరుణాచలం నిర్ణయం పార్టీకి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా, రాబోయే ఎన్నికల కోసం కమల్‌ ఈ నెల ప్రారంభంలో తన పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆయన ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల్లో కజగం పార్టీలతో పొత్తు పెట్టుకోనని స్పష్టం చేశారు. ఇటీవల ఎన్నికల కోసం పాలన ప్రణాళికను విడుదల చేశారు కమల్ హాసన్. గ్రీన్‌ చానల్‌ గవర్నమెంట్‌, ఆన్‌లైన్‌ హోమ్స్‌, గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ అవకాశాలు అందించడం, మహిళల సుసంపన్నం వంటి తదితర పథకాలను ప్రకటించారు.

   Politics

   Lifestyle