పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమబెంగాల్ కు వచ్చిన అమిత్ షా బీజేపీ శ్రేణుల్లో మంచి జోష్ నింపి వెళ్లారు. అమిత్ షా వచ్చివెళ్లిన తర్వాత ఏకంగా తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ దెబ్బకి వచ్చే ఎన్నికల్లో బీజేపీ వెస్ట్ బెంగాల్ లో అధికారంలోకి రావడం ఖాయమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అయితే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పై సోమవారం చేసిన ఒక ట్వీట్ సంచలనంగా మారింది. ‘రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఎన్ని ఎత్తులు వేసిన పది సీట్లకు మించి గెలువదని.. మమత బెనర్జీనే విజయం సాధిస్తుందని పీకే జోస్యం చెప్పాడు. బెంగాల్లో బీజేపీకి డబుల్ డిజిట్ కంటే ఎక్కువ సీట్లు వస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానంటూ’ సవాల్ విసిరాడు. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కోసం పని చేస్తున్నాడు.
పశ్చిమబెంగాల్లో బీజేపీ పాగా వేయాలని ఎప్పటి నుంచో భావిస్తోంది. అధికార తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని ఓడించడానికి శాయశక్తులు ఒడ్డుతోంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. అయితే బీజేపీ వ్యూహాలకు ప్రతీగా పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు.