తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ లోకనాయకుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ జోరు పెంచారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి ఒక్క సీటు కూడా గెలవని కమల్ ఇప్పుడు రాష్ట్రంలోని ద్రవిడ దిగ్గజ పార్టీలకు తామే ప్రత్యామ్నాయమని అంటున్నారు. మాజీ సీఎం దివంగత ఎంజీఆర్ కలను సాకారం చేస్తే.. ఆయనకు తానే రాజకీయ వారసుడిని అని కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కన్యాకుమారి తిరునల్వేలి ఎన్నికల ప్రచార సభల్లో కమల్ హాసన్ పాల్గొని ప్రసంగించారు. ఎంజీఆర్ కలను సాకారం చేయగలిగితే ఆయనకు తానే వారసుడిని అని అన్నారు. రజినీకాంత్ సిద్ధాంతాలు వేరు.. తన సిద్ధాంతాలు వేరు అని.. అయితే తామిద్దరం మంచి మిత్రులం అని కమల్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో తమ సిద్ధాంతాలు ఒకే రకంగా ఉంటాయా అన్నది రజినీకాంత్ చేయబోయే వ్యాఖ్యలు నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయని కమల్ అన్నారు.
ఇక టార్చ్ లైట్ గుర్తు కోసం తాము ఎన్నికల కమిషన్ ను అభ్యర్థించామని.. ఈ చిహ్నంను వదులుకునే ప్రసక్తే లేదని కమల్ అన్నారు. అది దక్కుతుందని భావిస్తున్నానన్నారు. మక్కల్ పార్టీ నేతృత్వంలో రాష్ట్రంలో మూడో కూటమి అన్నది సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని కమల్ అన్నారు.
ఇక రజినీకాంత్ కమల్ హాసన్ లు రాజకీయాల్లో రావడంతో తాను కూడా రాజకీయాలపై దృష్టిపెడుతున్నట్టు నటుడు పార్థిబన్ ప్రకటించారు. విజయ్ కూడా వస్తున్నాడని.. తాను ఒక రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆశతో ఉన్నానని.. ఏం జరుగుతుందో చూద్దాం అని ఆయన అన్నారు.