బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై పాతబస్తీ ఓటర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నగరంలోని ఉప్పల్, రామంతపూర్‌లో సంజయ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో వివాదాస్పద ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఓ సభలో పాల్గొన్న ఆయన.. ‘‘ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. మేయర్ పీఠం దక్కించుకుంటే.. బిడ్డా నీ పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం. రోహింగ్యాలు, పాకిస్తాన్, అఫ్గనిస్థాన్ దేశీయులను తరిమి తరిమి కొడతాం’’ అని హెచ్చరించారు.
నగరంలో రోహింగ్యాలు ఉంటే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తాన్ వాసులే ఎంఐఎంకు ఓట్లేస్తున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ ఖాయమన్నారు.
కాగ సంజయ్ వ్యాఖ్యల పై మంత్రి కేటీఆర్ ట్విటర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. 'హైదరాబాద్‌పై సర్జికల్ స్ట్రైక్ ఏంటి?! కొన్ని సీట్లు, ఓట్ల కోసం ఇంత దిగజారుతారా?. సహచర ఎంపీ విద్వేషపూరిత వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి సమర్థిస్తారా?' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు ఖండించలేదని కేటీఆర్ నిలదీశారు. పచ్చని హైదరాబాద్‌లో చిచ్చుపెడతారా? హైదరాబాద్ ప్రజలను విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.