HomeTelugu politics

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల డిసెంబర్ 1 పోలింగ్
Published By :  Lasya Raghavaraju Image Image
GHMC Elections Notification released Polling on December 1st
Tuesday Nov 17, 2020
గ్రేటర్‍ హైదరాబాద్‍ మున్సిపల్‍ కార్పొరేషన్‍ (జీహెచ్‍ఎంసీ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను దాంతోపాటు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.  బ్యాలెట్‌ పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతాయని పార్థసారథి పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ చట్ట ప్రకారమే 150 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. 

డిసెంబర్ 1వ తేదీన బల్దియా పోలింగ్ ఉండగా.. 4వ తేదీన కౌంటింగ్ జరగనుంది. రేపటి నుంచి జీహెచ్ఎంసీ నామినేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 20వ తేదీన నామినేషన్లకు చివరి రోజు కాగా, 21న నామినేషన్ల పరిశీలన, 22వ తేదీన ఉపసంహరణకు అవకాశముంది. ఒకవేళ రీ పోలింగ్ అవసరమైతే డిసెంబర్ 3న నిర్వహించనున్నారు. కొత్త చట్టం ప్రకారం మొత్తం రెండు వారాల్లో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.

గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో 74,04,486 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 52.09 శాతం ఉండగా.. మహిళలు 47.90 శాతం ఉన్నారు. ఇక అతి పెద్ద డివిజన్ గా ఉన్న మైలార్‎దేవ్‎పల్లిలో 79,290 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా రామచంద్రపురం లో 27,997 మంది ఓటర్లు ఉన్నారు. ఇక మహిళలు ఎక్కువగా ఉన్న బన్సీలాల్‎పేటలో మహిళలు 31,205 మంది ఉండగా.. పురుషులు 30,727 మంది ఉన్నారు. ఇక ఫతేనగర్ డివిజ‎న్‎లో ట్రాన్స్ జెండర్‎లు అధికంగా ఉన్నారు.

ఎన్నికల సంఘం గ్రేటర్‌ వ్యాప్తంగా రెండు, మూడు రోజుల క్రితం పోలింగ్‌ ముసాయిదాను ప్రకటించింది. ఎన్నికల కోసం 9,248 స్టేషన్లను ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పోలింగ్‌స్టేషన్లలో తక్కువ మంది సిబ్బందితోనే ఎన్నికలు సక్రమంగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు జరుగుతుండడంతో వీలైనంత ఎక్కువ మంది సిబ్బందిని తీసుకొని పకడ్బందీగా ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ యోచిస్తోంది.

   Politics

   Lifestyle