తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థిని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీని చంద్రన్న ఎంపిక చేసారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన పనబాక లక్ష్మీ మళ్లీ బరిలోకి దిగుతున్నట్లు నేతలతో చంద్రబాబు తెలిపారు.
తిరుపతి లోక్సభ నియోజక వర్గంలో పార్టీ నేతలతో ఈ రోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల్లో గెలవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు ప్రధానంగా చర్చించారు. పనబాక లక్ష్మీ గెలుపుకోసం అందరూ అహర్నిశలు పాటుపడాలని పార్టీ నేతలకు తెలిపారు.
వైసీపీకి చెందిన ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మృతి చెందడంతో ఇప్పుడు ఉప ఎన్నిక జరుగబోతుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం వైసీపీకి పెద్ద కష్టమేమీ కాకపోయినా, పోటీ మాత్రం గట్టిగానే వుండబోతోంది. చంద్రబాబు సొంత జిల్లా కావడంతో టీడీపీ, తిరుపతి లోక్సభ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని పనబాక లక్ష్మికి టిక్కెట్ దక్కడంపై రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇతర పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మీ ప్రటించబడ్డారు.