దివంగత కేంద్రమంత్రి దిగ్విజయ్ సింగ్ కుమార్తె, కామన్వెల్త్ గేమ్స్-2018 స్వర్ణపతక విజేత శ్రేయాసి సింగ్ భారతీయ జనత పార్టీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ పార్టీ నేత భూపేంద్ర యాదవ్ సమక్షంలో ఆదివారం ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రేయాసి సింగ్‌కు పార్టీ టికెట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అమర్పూర్ (బాంక), జముయి నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి ఆమెకు టికెట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె లోక్ జన్‌శక్తి పార్టీ (ఎల్జేపీ) జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ జముయి పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
2013లో మెక్సికోలో జరిగిన ట్రాప్ షూటింగ్ వరల్డ్ కప్‌లో ఇండియన్ టీమ్‌లో శ్రేయాసి సింగ్ తొలిసారి పాల్గొన్నారు. 2014లో స్కాట్లాండ్లోని గ్లాస్గోవ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్‌లో రజత పతకం సాధించారు. బిహార్‌లోని జముయి జిల్లాకు చెందిన శ్రేయాసి సింగ్ తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు.
కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు లోక్ జన్‌శక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో కలిసి తాము పోటీలో ఉండడం లేదని ప్రకటించారు. తాజాగా జేడీయూ-బీజేపీ మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. ఇంతలోనే చిరాగ్ ఈ ప్రకటన చేయడం పట్ల ఎన్డీయేలో చీలికలు వచ్చాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.