HomeTelugu politics

బీజేపీ నేతలతో నిమ్మగడ్డ రహస్య భేటీ ఎందుకోసమో
Published By :  Lasya Raghavaraju Image Image
nimmagadda secret meet with Sujana and Kamineni raises political heat
Tuesday Jun 23, 2020
ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యవహారంలో ఆసక్తికర పరిణామం తెర పైకి వచ్చింది. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో  రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌లతో  రమేష్‌ కుమార్‌ ఇటీవల భేటీ కావడం సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల 13న నిమ్మగడ్డ.. బీజేపీ నేతలైన కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరిలతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ బయటకు రావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. 

13వ తేది ఉదయం గం.10:47ని.లకు సుజనా చౌదరి, గం.11.23ని.లకు కామినేని, గం.11.44ని.లకు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ హోటల్‌కి రాగా.. ఆ ముగ్గురినీ ఒకరే రిసీవ్ చేసుకున్నారు. ఆ తరువాత ఒకే గదిలో దాదాపు గంటకు పైగానే ఆ ముగ్గురు మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియోపై అధికార వైసీపీ పార్టీ నేతలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.  రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నానంటూ వాదనలు చేస్తున్న రమేష్‌కుమార్‌కు రాజకీయనేతలతో మంతనాలు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై నిమ్మగడ్డ తీవ్ర ఆరోపణల వెనుక కుమ్మక్కు ఉందన్న తమ వాదనకు బలం ఇదేనని వారు చెబుతున్నారు. కోర్టులో కేసులు నడుస్తున్న సమయంలో, ఇదే కేసులో పిల్‌ వేసిన వ్యక్తితో నిమ్మగడ్డ చర్చలు, వారి కుమ్మక్కును తెలియజేస్తున్నాయని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. 

ఏపీ ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను కొనసాగించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్, ఏపీ ఎన్నికల సంఘం విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందకు నిరాకరించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇలాంటి సమయంలో సుజనా చౌదరి, కామినేనిని రమేష్ కుమార్ సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. 

   Politics

   Lifestyle