HomeTelugu politics

జగన్ ను నీరోతో పోలుస్తూ విమర్శించిన సుజనా చౌదరి
Published By :  Lasya Raghavaraju Image Image
Sujana Chowdary compares YS Jagan with Nero over Ramesh Kumar
Saturday Apr 11, 2020
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ పై వైసీపీ ప్రభుత్వం వేటు వేసిన సంగతి తెలిసిందే. ఏపీ పంచాయతీ రాజ్ చట్టం 1994ను ఉపయోగించి ఎస్ఈసీ పదవీ కాలాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆ ఆర్డినెన్స్‌కు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు.  కరోనా సమయంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం సరికాదని నిర్ణయాత్మకంగా వ్యవహరించిన రమేష్ కుమార్ పై ఇప్పుడు ఉద్వాసన పలకడంతో జగన్ ప్రభుత్వం పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

"రోమ్ తగలబడుతుంటే నీరో ఫిడేలు వాయించుకున్నట్టు... ప్రపంచమంతా కరోనాపై పోరాటం చేస్తుంటే జగన్ మాత్రం సొంత కక్షలు తీర్చుకోవడంలో బిజీగా ఉన్నారు. తాము అనుకున్నట్టు స్థానిక ఎన్నికలను జరపలేదనే కక్షతో... ఎస్ఈసీ రమేశ్ పదవీకాలాన్ని తగ్గిస్తూ హడావుడిగా ఆర్డినెన్సును జారీ చేయడం దీనికి నిదర్శనమని చెప్పారు. కక్షపూరిత చర్యలు మాని కరోనాపై దృష్టిని సారిస్తే బాగుంటుందని" ఆయన వరుస ట్వీట్లు చేశారు.

కాగా రమేష్ కుమార్ స్థానంలో మాజీ న్యాయమూర్తి వి. కనగరాజ్‌ను ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు వెల్లడించింది. ఈసీ నియామకానికి సంబంధించి కొత్త ఆర్డినెన్స్ తెచ్చిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వెంటనే కనగరాజ్ తన కార్యాలయానికి చేరుకొని బాధ్యతలు చేపట్టారు. మాజీ జస్టిస్ కనగరాజ్ మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేశారు. దాదాపు 9 సంవత్సరాల పాటు ఆయన తన బాధ్యతలను నిర్వర్తించారు. విద్య, బాలలు, మహిళల, వృద్ధుల సంక్షేమ అంశాలకు సంబంధించి ఆయన కీలక తీర్పులను ఇచ్చారు