HomeTelugu politics

డాక్టర్ సస్పెన్షన్ పై తీవ్రంగా స్పందించిన చంద్రబాబునాయుడు
Published By :  Divya Valluru Image Image
CBN criticizes CM Jagan over doctor Sudhakar Rao suspension
Wednesday Apr 08, 2020
విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో కరోనా భాదితులకు వైద్యం అందించే డాక్టర్లకు కనీస సౌకర్యాలు లేవని, ఒక మాస్క్ ఇచ్చి పదిహేను రోజులు వాడమంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వైద్యుడు సుధాకర్ రావుపై ను రాష్ట్ర వైద్య విధాన పరిషత్ సస్పెండ్ చేయడం తెలిసిందే. సుధాకర్ రావు పై  ‘కరోనా’ సంక్షోభ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం, 144 సెక్షన్ ఉల్లంఘన, ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా దూషించడం వంటి నేరాల కింద కేసులు కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది.

సుధాకర్ రావు సస్పెన్షన్ పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఆ ఆసుపత్రిలో మాస్క్ లు, గ్లోవ్స్ కొరత ఉందన్న విషయాన్ని చెప్పిన సుధాకర్ వ్యాఖ్యలపై స్పందించి, చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేయడం షాక్ కు గురిచేస్తోందని అన్నారు. వైద్య సేవలు అందించే యోధులను ఈ విధంగా అగౌరవపరిస్తే, ఇక బాధితులను రక్షించే క్రమంలో వారిలో ఏ విధంగా జగన్ స్ఫూర్తిని నింపుతారని ప్రశ్నించారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లో వైద్యులను, వైద్య సిబ్బందిని కచ్చితంగా కాపాడుకోవాలని, వారి గురించి శ్రద్ధ కనబరచాలని సీఎం జగన్ కు హితవు పలికారు.

సుధాకర్ రావు ఆరోపణలు చేసిన వీడియో వైరల్ కావడంతో, జాతీయ మీడియాలోనూ ఈ ఘటనపై వార్తలు వచ్చాయి. దీంతో ఆరోపణలు చేసిన డాక్టర్ పై మంత్రి పేర్ని నాని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇదంతా హైదరాబాద్ లో దాక్కుని చంద్రబాబు ఆడిస్తున్న నాటకమని మండిపడ్డారు.