HomeTelugu politics

కరోనాతో పోరాడే వైద్య సిబ్బందికి కోటి రూపాయల భారీ ఆసరా
Published By :  Divya Valluru Image Image
Delhi CM Arvind kejriwal to give Rs 1crore to doctor families if they die
Wednesday Apr 01, 2020
కరోనా వ్యాప్తి నేపధ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోన్న విషయం తెలిసిందే. మానవాళికి పెను ప్రమాదంగా మారిన కరోనా రక్కసి బారి నుంచి ప్రజలను కాపాడానికి వైద్యులు, నర్సులు, పారమేడికల్  సిబ్బంది వారి ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు. అటువంటి వారికోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. 

కరోనా పాజిటివ్‌ రోగులకు సేవలు అందిస్తూ వైద్య సిబ్బంది ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు రూ కోటి పరిహారం అందచేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం వెల్లడించారు. కరోనా కేసులను పరిశీలించే వైద్య సిబ్బంది సైనికులకు ఏ మాత్రం తక్కువకాదని ఆయన కొనియాడారు.  కరోనా రోగులకు సేవలందిస్తూ డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది ఎవరైనా మరణిస్తే వారి సేవలకు గౌరవసూచకంగా ఆయా కుటుంబాలకు రూ కోటి అందచేస్తామని చెప్పారు. వారు ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన వారైనా పరిహారం వర్తిస్తుందని సీఎం స్పష్టం చేశారు. 

మరోవైపు ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 240 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ అధికారిక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఈ సంఖ్యతో కలుపుకుంటే ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1637కు చేరింది. ఇందులో 1,466 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 133 మంది కోలుకున్నారు. 38 మంది ప్రాణాలు కోల్పోయారు.