HomeTelugu politics

బాలుడితో చెప్పులు తీయించుకున్న తమిళనాడు మంత్రి... నెటిజన్ల ఫైర్
Published By :  Divya Valluru Image Image
TN Forest Minister makes tribal children remove his chappal; video sparks outrage
Friday Feb 07, 2020
కొందరు రాజకీయ నాయకులు అధికారంలో ఉంటే అధికార మదంతో వాళ్ళు మనుషులు అని మర్చిపోతారు.  తమిళనాడు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి దిండిగుల్ శ్రీనివాసన్ కూడా అదే కోవలోకి వస్తారు. ఆయన చేసిన నిర్వాకంపై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రజలు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. 

మధుమలై నేషనల్ పార్కులో ఇటీవల ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపును ప్రారంభించడానికి అటవీ శాఖ మంత్రి దిండిగుల్ శ్రీనివాసన్ వచ్చారు. మందీ మార్బలంతో క్యాంపును ప్రారంభానికి వచ్చిన శ్రీనివాసన్.. అక్కడి ఓ చిన్న గుడిలో దర్శనానికి వెళ్లాల్సి ఉంది. మరి గుడిలోకి వెళ్లాలంటే చెప్పులు తియ్యాలి కదా. చెప్పులు తియ్యడానికి చేతులతో పనిలేదు. కాళ్లను వెనక్కి లాక్కుంటే సరిపోతుంది కదా. ఈ మంత్రిగారు మాత్రం... అక్కడి ఓ గిరిజన పిల్లాణ్ని పిలిచి... తన కాళ్లకు ఉన్న చెప్పుల్ని తీయించుకున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఫోటో గ్రాఫర్లు ఫోటోలను తీసేందుకు సిద్ధమైన సమయంలో..వారిని ఆపమని కోరారు. కూనూర్‌ ఎమ్మెల్యే శాంతి ఎ.రామ్‌ సైతం ఫోటోలు తీయకుండా వారిని అడ్డుకున్నారు. మంత్రితో పాటు..ఆయన మరో అనుచరుడు సైతం చెప్పులను తొలగించాలని బాలుర్లను అడిగినట్లు తెలుస్తోంది. ఈ దారుణం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ మంత్రి గారిని అదే చెప్పుతో కొడితే కానీ బుద్దిరాదని చీవాట్లు పెడుతున్నారు. ఇదే పని ఇంకెవరైనా చేస్తే... ఈ పాటికే కేసు నమోదవుతుంది. మరి మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఆయన మంత్రి అయితే ఎవరికి ఎక్కువ? తప్పు చేశారు కాబట్టి... చర్యలు తీసుకొని ఆయన్ని అరెస్టు చెయ్యాలి అని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

   Politics

   Lifestyle