HomeTelugu politics

టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా
Published By :  Lasya Raghavaraju Image Image
TDP MLC Dokka Manikyavaraprasad resigns from TDP
Tuesday Jan 21, 2020
తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ, మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. 

భవిష్యత్తుల్లో ఇక తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని... అమరావతి నుంచి రాజధాని తరలిపోతున్నందుకు బాధగా ఉందని ఆయన పేర్కొన్నారు. టీడీపీలో తనను ప్రొత్సహించినందుకు ఆయన చంద్రబాబుకు లేఖలో కృతజ్ఞతలు తెలిపారు. గత ఎన్నికల్లో పత్తిపాడు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా డొక్కా పోటీ చేశారు.

టీడీపీ ఎమ్మెల్సీలకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫోన్ చేసి ఒత్తిడి చేస్తున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించిన నేపథ్యంలోనే... టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తన పదవికి రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. తొలిరోజు మండలి సమావేశానికి హాజరైన డొక్కా రెండో రోజు హాజరుకాలేదు.  మరో టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి కూడా సమావేశాలకు హాజరుకాలేదు. అయితే.. తాను అనారోగ్యం కారణంగానే హాజరుకాలేదని ఆమె తెలిపారు. 

బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కూడా సభలో లేకపోవడం కొసమెరుపు.  

   Politics

   Lifestyle