HomeTelugu politics

సిఎం హోదాలో సిబిఐ కోర్టుకు హాజరైన జగన్
Published By :  Lasya Raghavaraju Image Image
Jagan appears before CBI Court for the first time after becoming CM
Friday Jan 10, 2020
అక్రమాస్తుల కేసులో వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి నేడు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా హైదరాబాద్‌లోని సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. శుక్రవారం నాంపల్లిలోని ప్రత్యేక కోర్టుకు నేరుగా బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి వచ్చారు. ఆయన వెంట ఏ2 ముద్దాయి విజయసాయి రెడ్డి వచ్చారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన సిబిఐ ప్రత్యేక కోర్టు కేసు తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. 

ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున కేసు విచారణలో వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్‌ కోర్టును మరోసారి కోరారు. తన బదులు సహ నిందితుడు కోర్టుకు హాజరవుతారని జగన్‌ చెప్పారు. జగన్‌ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఈ నెల 17న కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. 

జగన్‌పై మొత్తం 11 ఛార్జిషీట్లు దాఖలయ్యాయి. 2011 ఆగస్టు 17వ తేదీన హైకోర్టు ఆదేశాలతో సిబిఐ జగన్‌పై కేసు నమోదు చేసింది. 2012 మే 25న సిబిఐ జగన్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించింది. అప్పటినుంచి 16 నెలలపాటు జగన్‌ జైలు జీవితం అనుభవించారు. 2013 సెప్టెంబర్‌ 23న జగన్‌ జైలు నుంచి విడుదలయ్యారు. 2012 మార్చి 31న సిబిఐ మొదటి ఛార్జిషీటు దాఖలు చేసింది. 2014 సెప్టెంబర్‌ 9వ తేదీన ఇందు ప్రాజెక్టు కేసులో చివరి ఛార్జిషీటును సిబిఐ దాఖలు చేసింది. 

సిబిఐ ఛార్జిషీటులో ఆనాటి మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబిత, పలువురు ఐఎఎస్‌ల పేర్లు చోటు చేసుకున్నాయి. సిబిఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లలో 6 అభియోగపత్రాలపై విచారణ జరిగింది.