HomeTelugu politics

గుండెపోటుతో రాజధాని రైతు కృపానందం మృతి
Published By :  Divya Valluru Image Image
Nara Lokesh blames Jagan for Amaravati farmer Krupanandam demise
Wednesday Jan 08, 2020
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గత 20 రోజులుగా అమరావతి రైతులు నిరసన తెలియచేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి ప్రాంత రైతులు గడిచిన మూడునాలుగు రోజులుగా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం వారిని అస్సలు పట్టించుకోవడంలేదు. నిరసన తెలుపుతున్న రైతులను పెయిడ్ అర్టిస్టులంటూ వ్యాఖ్యలు చేసి.. వైసీపీ నాయకులు కొందరు వారిని కించపరుస్తున్నారు. ఈ క్రమంలో మానసిక అందోళనకు గురైన ఒక రైతు గుండె అగింది. 

అమరావతి ప్రాంతమైన కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన రైతు  అద్దేపల్లి కృపానందం (68) బుధవారం  తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందాడు.రాజధాని కోసం కృపానందం తనకున్న అర ఎకరం పొలాన్ని ల్యాండ్‌ పూలింగ్‌ కోసం ఇచ్చాడు. అయితే జగన్ రాజధాని మార్పు ప్రకటన చేయడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నాడు.  గత 22 రోజులుగా రాజధాని అమరావతికి మద్దతుగా  నిరసనల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున  గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు కృపానందంను మంగళగిరి లోని  ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.

కృపానందం మృతిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. 

సీఎం జగన్ చెత్త నిర్ణయాలకు రైతులు బలైపోతున్నారు. ప్రాణం కంటే ఎక్కువుగా ప్రేమించే భూమిని రాజధాని కోసం త్యాగం చేసిన రైతుల పరిస్థితి తలుచుకుంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కృపానందం మృతి తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. వైకాపా నాయకులు రైతులను అవమనిస్తూ, కించపరుస్తూ మాట్లాడుతున్న మాటలు రైతులను మానసికంగా ఆందోళనకు గురిచేస్తున్నాయని విమర్శించారు. మూర్ఖంగా వ్యవహరించకుండా రాజధాని పై ప్రభుత్వం పునరాలోచించడం మంచిదని హితవు పలికారు లోకేష్.