HomeTelugu politics

ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపిన జనసేనాని
Published By :  Lasya Raghavaraju Image Image
Pawan Kalyan extends support to TSRTC strike in Telangana
Tuesday Oct 15, 2019
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమ సమస్యలు, నాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత పది రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జెఏసి ఈ నెల 19 వ తేదీన రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బందుకు జనసేన పార్టీ మద్దతు తెలిపింది. ఈ మేరకు పవన్ కల్యాణ్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసి ఆర్టీసి సమ్మెపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

'తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్ధం చేసుకుని పరిశీలించాలే తప్ప కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం సరికాదని పవన్ కల్యాణ్ హితవు పలికారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై స్పందిస్తూ పవన్‌ కల్యాణ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సమ్మె చేపట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ప్రభుత్వం.. 48,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నామని ప్రకటించడం సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు. 

ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ రాణీగంజ్‌లో సురేందర్ గౌడ్ అనే ఆర్టీసీ కార్మికులు ఆత్మార్పణం చేసుకోవడం బాధాకరమని జనసేన వ్యాఖ్యానించింది. ఇకపై ఇలాంటి బలిదానాలు జరగకూడదని పార్టీ ప్రకటనలో తెలిపింది. అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుందని పవన్ విజ్ఞప్తి చేసాడు. 

   Politics

   Lifestyle