HomeTelugu politics

జగన్ కూడా ఫర్నీచర్ దొంగే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Published By :  Divya Valluru Image Image
Chandrababu Naidu sensational comments on Jagan over furniture
Thursday Sep 19, 2019
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈరోజు గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్‌ను రాజ్‌భవన్‌లో కలిసి 13 పేజీల వినతిపత్రం అందజేశారు. జగన్ మూడు నెలల పాలనలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ దాడులు, రాష్ట్రంలో శాంతిభద్రతలు, కోడెల ఆత్మహత్యకు కారణాలు, ప్రభుత్వ వేధింపులు, అక్రమ కేసులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. 

అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ "కోడెల ఇంట్లో ఉన్నది దోచుకున్న ఫర్నీచర్ అయితే, సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి ఇంట్లో ఉన్నది కూడా దోచుకున్న ఫర్నీచరేనని" ఘాటు వ్యాఖ్యలు చేసారు. "మంత్రులు, స్పీకర్, చీఫ్ విప్‌లకు ప్రభుత్వం ఫర్నీచర్ ఇస్తుంది. పదవీకాలం అయిపోయాక ప్రైవేట్ సెక్రటరీ అవన్నీ ప్రభుత్వానికి సరెండర్ చేస్తారు. అది పీఎస్ బాధ్యత. అయినా, జూన్ 7, జూన్ 20న రెండు సార్లు అసెంబ్లీ సెక్రటరీకి, స్పీకర్‌కు కోడెల లేఖ రాశారు. ఫర్నీచర్ తీసుకెళ్లాల్సిందిగా కోరారు. కానీ, జూన్ 24న తప్పుడు కేసు పెట్టారు. ప్రభుత్వమే ఫర్నీచర్ ఇచ్చింది. దాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. కానీ, కోడెలను వేధించారు. మూడు నెలల్లో 18 కేసులు పెట్టారు. అందులో కొన్నింటిలో ఏ2గా శివప్రసాదరావు పేరు పెట్టి వేధించారు’ అని చంద్రబాబు మండిపడ్డారు.  

గవర్నర్‌ను కలిసిన వారిలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, కళా వెంకట్రావు, నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమ, ఇతర నాయకులు ఉన్నారు.