HomeTelugu politics

ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పై నిషేధం
Published By :  Divya Valluru Image Image
AP CM Jagan bans Govt doctors private practice
Thursday Sep 19, 2019
నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసినప్పటినుంచి ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్న జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ఏపీలో ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు వైద్యులకు పరిహారంగా వేతనాలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. 

డాక్టర్ సుజాతారావు అధ్యక్షతన ఆరోగ్య రంగ సంస్కరణలపై ఏర్పాటైన నిపుణుల కమిటీ బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తుది నివేదికను అందజేసింది.  ఈ సమీక్షలో 100కు పైగా సిఫార్సులతో సుజాతరావు కమిటీ రూపొందించిన నివేదికలోని అంశాలను సీఎం జగన్‌కు వివరించారు. దీనిపై నిపుణుల కమిటీతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ వైద్యులచే ప్రైవేట్ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం జరిపిస్తే తీవ్రంగా పరిగణించి ఆ ఆస్పత్రిని జాబితా నుంచి తప్పించాలని కమిటీ చేసిన ప్రతిపాదనను సీఎం ఆమోదించారు. ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధం, వేతనాల పెంపుదలకు సంబంధించి సమగ్రమైన ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం సూచించారు.

జనవరి 1వ తేదీ నుంచి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పథకం అమలుకానుంది. 2 వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తెస్తూ... పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా.. మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులను కొత్తగా చేర్చింది ప్రభుత్వం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకూ ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది.  ఆపరేషన్లు చేయించుకున్న వాళ్లు కోలుకునే వరకూ నెలకు రూ.5 వేల సాయం అందించనున్నారు.  ప్రభుత్వ వైద్యుల వేతనాలు పెంచాలని కమిటీ సూచించింది.

కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లాగే.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 5 వేలు సాయానికి సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. రూ. వెయ్యి వ్యయం దాటే ప్రతి వ్యాధికి ఆరోగ్య శ్రీలో చికిత్స అందిస్తారు. డిసెంబర్ 21 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ జరుగుతుంది.