HomeTelugu politics

ఛలో ఆత్మకూరు సెగ ; చంద్రబాబు, నారా లోకేశ్ హౌస్ అరెస్టు
Published By :  Lasya Raghavaraju Image Image
Chandrababu and Nara Lokesh house arrest in Undavalli over Chalo Atmakur
Wednesday Sep 11, 2019
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌ను ఉండవల్లిలోని నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ‘చలో ఆత్మకూరు’కు బయల్దేరిన  చంద్రబాబు, లోకేశ్‌లతో పాటు కీలక నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. 

వైసీపీ దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఛలో ఆత్మకూరుకు పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వని పోలీస్ ఉన్నతాధికారులు అర్ధరాత్రి నుంచే టీడీపీ ముఖ్యనేతల ఇళ్ల చుట్టూ మోహరించారు. గుంటూరు జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. పల్నాడుతో 30పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. 

ఉదయాన్నే చంద్రబాబును కలిసేందుకు వచ్చిన పార్టీ నేతలు టీడీ జనార్దన్, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుని పోలీసులు అడ్డుకున్నారు. మా అధినేతను కలిసేందుకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ అచ్చెన్నాయుడు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమానికి బయలుదేరిన టీడీపీ నేతలు దేవినేని అవినాష్‌, చంద్రదండు ప్రకాశ్‌, గోనుగుంట కోటేశ్వరరావును ఉండవల్లి గుహలు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.

‘చలో ఆత్మకూరు’ నేపథ్యంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, గద్దె రామ్మోహన్‌రావు, కృష్ణా జిల్లా గొల్లపూడిలో దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి శిద్దా రాఘవరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సత్తెనపల్లిలో మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ రామస్వామి, మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌ పెదకరిముల్లా, పట్టణ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావులతో పాటు 14 మందిని బైండోవర్‌ చేశారు.

   Politics

   Lifestyle