HomeTelugu politics

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఊర్మిళ మటోండ్కర్
Published By :  Divya Valluru Image Image
Actress Urmila Matondkar quits Congress party
Tuesday Sep 10, 2019
బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ మంగళవారంనాడు కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇదే సంవత్సరం మార్చి నెలలో లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఊర్మిళ మటోండ్కర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నరు. ఆరు నెలలు తిరక్కుండానే ఇప్పుడు ఆమె తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసారు. 

సమున్నత లక్ష్యం కోసం ముంబై కాంగ్రెస్‌లో తాను పనిచేయాలనుకున్నానని, అయితే పార్టీలో అంతర్గత రాజకీయాలు తారాస్థాయికి చేరాయని.. అంతర్గత రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాల కోసం తన పేరును ఉపయోగించుకుంటున్నారని, ఇది తనకు ఇష్టం లేనందున తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని ఊర్మిళ ఓ నేషనల్ పత్రికకి తెలిపారు.
 
గడిచిన ఎన్నికలలో ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీచేసిన ఊర్మిళ, బీజేపీ అభ్యర్థి గోపాల్ షెట్టి చేతిలో 4 లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో రాజకీయాల నుంచి ఆమె వైదొలుగుతున్నారనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. అయితే, ఆ వార్తలను ఆమె వెంటనే ఖండించారు. ఎన్నికల్లో ఓడినప్పటికీ మంచి పోరాటం చేశానని, ఆత్మసాక్షిగా, ఎంతో గౌరవంతో ఈ ఎన్నికల్లో శ్రమించానని, ఇంకెంతో నేర్చుకున్నానని, రాజకీయాలు వదిలి ఎక్కడికీ వెళ్లనని చెప్పారు.

   Politics

   Lifestyle