రెండు దశాబ్దాల క్రితం బ్రహ్మంగారు చెప్పినట్లు తాగే నీటిని బాటిళ్ళలో అమ్ముతూ ఉంటే అంతా నోరు వెళ్లబెట్టి చూశారు. కానీ ఇప్పుడు మంచి నీటిని ప్రతిఒక్కరు కొనుక్కుని తాగే పరిస్థితి వచ్చింది. మరో పాతికేళ్ళు ఆగితే గాలిని కూడా కొనుగోలు చేసి పీల్చే పరిస్థితి వస్తుంది అని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కాస్త వినడానికి కఠినంగా ఉన్నా కూడా ముందు ముందు జరగబోతుంది అంటూ మొన్నటి వరకు ప్రచారం చేసిన వారు ఇప్పుడు ఏకంగా గాలిని అమ్మేస్తున్నారు.
లండన్ లో స్వచ్ఛమైన గాలి అంటూ అమ్మకానికి ఉంచారు. ఈ గాలి అమ్మకానికి అక్కడ ప్రభుత్వం కూడా ఒకే చెప్పింది. బయటి గాలిలో కరోనా వైరస్ ఉంటోందనీ అందువల్ల తాము అమ్మే బాటిల్స్‌లో గాలి అత్యంత శుభ్రమైనదని చెబుతోంది. ఆ గాలిలో ఏ వైరస్‌లూ లేకుండా తయారుచేసినట్లు చెబుతోంది. ఆన్లైన్లో కూడా అమ్మకానికి ఉంచారు. ఇంతకీ వీటి ధర చెప్పలేదు కదూ... అర లీటర్ బాటిల్ ధర రూ.2,000. నమ్మలేకపోతున్నారు కదా... అదే మరి చిత్రమంటే.
మరి ఆ బాటిల్ కొనుక్కునే వారు ఆ గాలిని ఎలా పీల్చుతారు అనేది తేలని ప్రశ్న. వారు పీల్చే దాకా ఆ గాలి ఆ బాటిల్ లోనే ఎందుకుంటుంది... బయటకు వచ్చేయడం సహజం. దాంతో దీనిని ఎవరు తీసుకుంటారు అని అంతా అనుకున్నారు. కానీ ఈ గాలికి బాగానే డిమాండ్ ఉన్నట్లుగా చెబుతున్నారు.