HomeTelugu news

పుదుచ్చేరిలో కూలిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం సీఎం రాజీనామా
Published By :  Divya Valluru Image Image
Congress government loses trust vote CM Narayanasamy resigns
Monday Feb 22, 2021
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది.  పుదుచ్చేరి అసెంబ్లీలో సోమ‌వారం జ‌రిగిన బ‌ల‌ ప‌రీక్ష‌లో ముఖ్య‌మంత్రి నారాయ‌ణ‌స్వామి త‌న మెజార్టీ నిరూపించుకోవ‌డంలో విఫ‌ల‌మయ్యారు.  తగిన సంఖ్యాబలం లేకపోవడంతో విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే సీఎం సభ నుంచి వెళ్లిపోయారు. రాజ్ నివాస్‌కు వెళ్లి తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసైకి సమర్పించారు. 

మెజార్టీ నిరూపించుకోవ‌డానికి 14 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు అవ‌స‌రం కాగా.. కాంగ్రెస్ ద‌గ్గ‌ర 12 మంది స‌భ్యుల బ‌లం మాత్ర‌మే ఉంది. విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంలో ప్రసంగించిన సీఎం నారాయణ స్వామి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రజల కోసం రాత్రింబవళ్లూ పనిచేశామని ఆయన చెప్పారు. పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా పనిచేసిన కిరణ్ బేడీ ప్రతిపక్షంతో కలిసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారని సీఎం ఆరోపించారు. తమ ఎమ్మెల్యేల మద్దతుతో ఐదేళ్ల పాటు తమ ప్రభుత్వం ప్రజలకు సేవ చేసిందని ఆయన చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్రాన్ని నిధులడినప్పటికీ మంజూరు చేయలేదన్నారు.

"కేంద్రంలోని బీజేపీ, ఎన్ఆర్ కాంగ్రెస్, ఏఐఏడీఎంకే కలిసి మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేశాయి. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే. పుదుచ్చేరి ప్రజలు వారికి సరైన రీతిలో బుద్ధి చెబుతారు" అని నారాయణ స్వామి అన్నారు.

పలువురు ఎమ్మెల్యేల రాజీనామా తర్వాత, సభలో కాంగ్రెస్, డీఎంకే సంకీర్ణ ప్రభుత్వ బలం 11కు పడిపోయింది. ప్రతిపక్షానికి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

   Politics

   Lifestyle