కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో రాజకీయ అంశంగా మారిన కొత్త వ్యవసాయ చట్టాల పై సుప్రీంకోర్టు స్టే విధించింది. రైతుల ఆందోళనలపై కేంద్రం అభ్యంతరాలను తోసిపుచ్చిన సుప్రీం కోర్ట్ మళ్లీ ఆర్డర్ వచ్చేంతవరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.
రైతుల సమస్యలను పరిష్కరించేందుకు నలుగురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్ధిక వేత్తలతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీ రైతు ప్రతినిధులు, ప్రభుత్వంతో కమిటీ చర్చలు జరుపుతుందని తమకు నివేదిక సమర్పిస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది. అయితే, ఈ కమిటీ ఉద్దేశం ప్రభుత్వాన్ని శిక్షించడం కాదని.. కేవలం ధర్మాసనానికి నివేదిక సమర్పించేందుకేనని తెలిపింది. అలాగే క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నామని అభిప్రాయపడింది. కమిటీని నియమించే అధికారం తమకు ఉందని ధర్మాసనం పేర్కొంది. కావాలంటే చట్టాలను నిలిపివేసే అధికారం కూడా ఉందని తెలిపింది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం మధ్యాహ్నం విచారణ జరిపింది. సుదీర్ఘంగా వాదోపవాదాలు జరిగాయి. తమకున్న హక్కులకు అనుగుణంగా రైతు సమస్యలను పరిష్కరించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. చట్టాన్ని సస్పెండ్ చేసి కమిటీ వేయడం తమకున్న అధికారాల్లో ఒకటని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే పేర్కొన్నారు.
అయితే, రైతులు కమిటీ ముందుకు వచ్చేందుకు సిద్ధంగా లేరని వారి తరఫున న్యాయవాది ఎం.ఎల్.శర్మ ధర్మాసనానికి తెలియజేశారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. అలాంటి మాటలు వినడానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కావాలంటే అభిప్రాయాలు చెప్పాల్సిందేనని తేల్చి చెప్పారు.