కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కారు కర్ణాటకలో ప్రమాదానికి గురైంది. ఉత్తర కన్నడ జిల్లా అంకోలా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ భార్య విజయ, ఆయన పీఏ మృతి చెందారు. శ్రీపాద్ నాయక్ తీవ్రంగా గాయపడ్డారు.
శ్రీపాద్ నాయక్ ప్రయాణిస్తున్న కారు కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంకుల సమీపంలో బోల్తాపడింది. ఎల్లాపూర్ నుంచి గోకర్ణ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీపాద్ నాయక్ భార్య విజయ నాయక్, పీఏ దీపక్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ వాళ్లు తుదిశ్వాస విడిచినట్టు పోలీసులు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం కేంద్రమంత్రిని గోవాలోని బంబోలి ఆస్పత్రికి తరలించారు.
శ్రీపాద్ నాయక్ కు మెరుగైన చికిత్స అందేలా చూడాలని గోవా సీఎం ప్రమోద్ సావంత్‌ను ప్రధాని మోదీ కోరారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో మాట్లాడారు. కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్‌కి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు, ఇంకా అవసరమైతే శ్రీపాద్ నాయక్‌ను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీకి తరలించాల్సిందిగా సూచించారు.
శ్రీపాద్ నాయక్ ఉత్తర గోవా నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.