HomeTelugu news

ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన పృథ్వి
Published By :  Ravi Koneri Image Image
Actor Prudhvi resigns from SVBC Chairman post over call recording
Monday Jan 13, 2020
టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్‌ చైర్మన్‌ పదవికి ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ పృధ్వీ ఆదివారం రాజీనామ చేసారు. ఒక మహిళతో పృథ్వీ అసభ్యంగా మాట్లాడినట్టు కొన్ని ప్రసార మాధ్యమాల్లో ఆడియో ప్రసారాలు జరగడంతో.. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. దీంతో ఆడియో టేపుల్లోని వాయిస్‌ శాంపిల్‌ను టీటీడీ విజిలెన్స్‌ అధికారులు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు  పంపించారు. అలాగే ఈ అంశాన్ని వైవీ సుబ్బారెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో పృథ్వీని రాజీనామా చేయాల్సిందిగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించినట్టుగా తెలిసింది.

ఈ సందర్భంగా పృధ్వీ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వైసీపీ పార్టీకోసం చేసిన సేవను గుర్తించి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్వీబీసీ చైర్మన్ పదవీ కట్టబెట్టారు. అయితే తనకు దక్కిన గౌరవానికి అసూయతో ఉన్న కొందరు తనను ఏ విధంగా దెబ్బకోట్టాలని ఆలోచించారు. అందుకే ఫేక్ ఆడియో టేపులను నావి అంటూ బయటకు తెచ్చారు అని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలతో టీటీడీకి ఎటువంటి చెడ్డపేరు రాకూడదనే ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామ చేశానని అన్నారు. 

నా వ్యక్తి గత ప్రతిష్టను దెబ్బకొట్టినందుకు బాధ కలుగుతోంది. పార్టీ సిద్దాంతాన్ని గౌరవిస్తూ రాజీనామా చేస్తున్నాను. కాంట్రాక్టు ఉద్యోగుల నియామకంలో నా ప్రమేయం లేదు. విజిలెన్స్‌ రిపోర్ట్‌ వచ్చాక వాస్తవాలు తెలుస్తాయి. మహిళతో మాట్లాడింది నేను కాదు. నా గొంతును ఎవరో మిమిక్రీ చేశారు. ఈ ఘటనపై పోలీసులుకు ఫిర్యాదు చేశాను. ఎస్వీబీసీ చానల్‌ నిధులు ఒక్క రూపాయి కూడా తినలేదు. నాపై దుష్ప్రచారం చేయడంతో మా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నాపై దుష్ప్రచారం చేసినవారికి సవాలు విసురుతున్నాను. నేను ఏ పరీక్షకైనా సిద్దంగా ఉన్నాను. నాపై వచ్చిన అపవాదులు తొలగిపోయాక మళ్లీ బాధ్యతలు తీసుకుంటాను. నా రాజీనామాను ఫ్యాక్సులో పంపించాను. ఇక పదో తేదీ నాపై దాడి జరిగింది. కొందరు వ్యక్తులు నా మొహంపై పిడిగుద్దలు గుద్ది పారిపోయారు. ’ అని తెలిపారు. 

   Politics

   Lifestyle