ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్ లో మొదటి ట్రిపుల్ సెంచరీ చేసాడు. పాకిస్థాన్‌తో అడిలైడ్ ఓవల్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో డేవిడ్ వార్నర్ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 166 పరుగులతో క్రీజులో ఉన్న 33 ఏళ్ల వార్నర్ రెండో రోజు అజేయంగా 335 పరుగులు చేశాడు. మరో ఆటగాడు మార్నస్ లబుషేన్ 162 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌ను 589/3 వద్ద డిక్లేర్ చేసింది.
ట్రిపుల్ సెంచరీ సాధించిన ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ వార్నర్ డే/నైట్ టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో అజర్ అలీ (456)ను వెనక్కి నెట్టేశాడు. అలాగే, ఈ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీని అధిగమించాడు. పుణెలో గత నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో కోహ్లీ అజేయంగా 254 పరుగులు చేశాడు. ఇందులో 33 బౌండరీలు, 2 సిక్సర్లు ఉన్నాయి. కాగా, వార్నరల్ 389 బంతుల్లో త్రిశతకం చేశాడు. ఇందులో 37 బౌండరీలు ఉన్నాయి.
589/3 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా.. డే/నైట్ టెస్టులో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. ఈ టెస్టులో 335 పరుగులు చేసిన వార్నర్‌కు ఇదే కెరియర్ బెస్ట్. 2015లో న్యూజిలాండ్‌తో పెర్త్‌లో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ 253 పరుగులు చేశాడు. అలాగే అడిలైడ్ ఓవల్ మైదానంలో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి ఆసీస్ ఆటగాడిగానూ వార్నర్ రికార్డులకెక్కాడు.