HomeTelugu news

ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య
Published By :  Divya Valluru Image Image
Wife kills Army husband to continue illicit affair
Wednesday Sep 11, 2019
తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న అక్కసుతో ప్రియుడుతో కలిసి ఆర్మీలో సిపాయిగా ఉద్యోగం చేస్తున్న భర్తను కడతేర్చిన భార్య ఉదంతం విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకొంది.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన సతీష్‌ సైన్యంలో పనిచేస్తున్నాడు. సతీష్‌ జమ్మూకశ్మీర్‌లో ఉండగా, భార్య జ్యోతి,  ఇద్దరు పిల్లలు  విశాఖ సిటీ మద్దిలపాలెంలో ఉంటున్నారు. తొమ్మిది నెలల క్రితం జ్యోతికి పాత జైలురోడ్డుకు చెందిన భరత్‌ కుమార్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి  దారితీసింది. జ్యోతి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆమె అత్త ఆమెను మందలించింది. కొద్ది రోజుల తర్వాత సతీష్‌ డ్యూటీకి నెల రోజులు సెలవు పెట్టి ఇంటికి వచ్చాడు. ఈ నేపథ్యంలో జ్యోతి వివాహేతర సంబంధం గురించి తెలుసుకొని ఆమెను నిలదీశాడు. తన వివాహేతర సంబంధం బట్టబయలు కావడంతో భర్తను హతమార్చాలని పన్నాగం పన్నింది జ్యోతి. 

ప్రియుడు భరత్‌ కుమార్, అతని స్నేహితుడు భాస్కర్‌తో కలిసి ప్లాన్‌ చేసింది. సతీష్‌ కుమార్‌ తాగే విస్కీలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది. సతీష్‌ నిద్రమత్తులోకి జారుకున్న తర్వాత ప్రియుడు భరత్‌,  భాస్కర్‌లకు ఫోన్‌ చేసి ఇంటికి రప్పించింది. ముగ్గురు కలిసి నిద్రమత్తులో ఉన్న సతీష్‌ మెడకి చున్నీ బిగించి హత్య చేశారు. అనంతరం అదే చున్నీతో ఫ్యాన్‌కి వ్రేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఏమి తెలియనట్లుగా తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది.

ఈ కేసులో సతీష్‌ భార్య జ్యోతి, ఆమె ప్రియుడు భరత్‌ కుమార్‌, అతని స్నేహితుడు భాస్కర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

   Politics

   Lifestyle