ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ సోకితే మొదట జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం వస్తాయని అందరూ అనుకుంటుంటారు. అయితే కరోనా లక్షణాల గురించి యూనివర్సిటీ కాలేజ్ లండన్ (యూసీఎల్) కొత్త నివేదికను రిలీజ్ చేసింది. ఆ వర్సిటీ పరిశోధన ప్రకారం.. కరోనా సోకిన వారు వాసన గుర్తించడం కష్టమే. అయితే కరోనా వల్ల కలిగే దగ్గు, జ్వరం లక్షణాల కన్నా వాసన గుణం కోల్పోతే అప్పుడు కచ్చితంగా కరోనా వైరస్ సంక్రమించినట్లు భావించవచ్చట.
సుమారు 590 మందిపై జరిపిన పరీక్షల ద్వారా పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. దాంట్లో 80 శాతం మంది వాసన గుణాన్ని కోల్పోయినట్లు చెప్పారు. కేవలం స్వల్ప లక్షణాలు ఉన్నవారిపైనే ఈ పరిశోధన చేపట్టారు. ముక్కు, గొంతు, నాలుక వెనుభాగంలో ఉన్న కణాలను వైరస్ పట్టడం వల్ల రోగులు వాసన గుణాన్ని కోల్పోతున్నట్లు యూసీఎల్ తన రిపోర్ట్‌లో పేర్కొన్నది.
ప్రస్తుత తరుణంలో వాసన, రుచి కోల్పోయిన వారు కోవిడ్ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.