HomeTelugu lifestyle

డయాబెటిస్‌ అదుపులో ఉండాలంటే ఈ పండ్లు తినాల్సిందే
Published By :  Divya Valluru Image Image
Eight Fruits That Are Good for Diabetics, Fruits for Diabetes
Saturday Oct 06, 2018
డయాబెటిస్ నియంత్రణలో ఉండడం అన్నది ముఖ్యంగా మనం తినే ఆహారం మీదే ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. తీసుకునే ఆహారంలో ఉండే కాంపోనెంట్లు రక్తంలో చక్కెరలు పెరగడం, తరగడాన్ని నిర్దేశిస్తాయి. అందుకే డయాబెటిస్ బారిన పడిన వారు మందుల కంటే ముందు ఏ తరహా ఆహారం తీసుకోవాలి, దేన్ని తీసుకోరాదన్న అవగాహన పెంచుకోవాలి. కనుక వారు తీసుకోవాల్సిన ఆహారం, పండ్లు గురించి తెలుసుకుందాం.

1. జామ పండ్లు 
సీజన్‌లో లభించే పండ్లలో జామ పండ్లు కూడా ఒకటి. జామ పండు పేదవాడి యాపిల్‌గా పేరుగాంచింది. సామాన్య ప్రజలకు కూడా ఇవి చాలా చవకగా లభిస్తాయి. అయితే జామ పండ్లను తరచూ తింటే అధిక బరువును తగ్గించుకోవడంతోపాటు డయాబెటిస్‌ను కూడా నియంత్రణలో ఉంచవచ్చు. 

2. స్ట్రాబెర్రీలు 
స్ట్రాబెర్రీలు తక్కువ గ్లయిసీమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని తింటే అంత త్వరగా గ్లూకోజ్ స్థాయిలు పెరగవు. పైగా వీటిలో ఉండే విటమిన్ సి అధిక బరువును తగ్గించడంతోపాటు డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకునేందుకు సహాయం చేస్తుంది. 

3. యాపిల్ 
యాపిల్ పండ్లలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఫ్లేవనాయిడ్లు, బీటా కెరోటీన్ కూడా వీటిలో సమృద్ధిగానే ఉంటాయి. ఇవన్నీ ఆకలిని నియంత్రిస్తాయి. తద్వారా అధిక ఆహారం తినకుండా జాగ్రత్త పడవచ్చు. దీంతో బరువు తగ్గుతారు. అలాగే డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది. 

4. బొప్పాయి
బొప్పాయిలో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటి వల్ల గుండె, మెదడు కణాలు నాశనం కాకుండా ఉంటాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

5. దానిమ్మ
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. దీర్ఘకాలంగా వ్యాధులతో బాధ పడేవారికి దానిమ్మ చాలా మంచిది. ఇందులో చక్కెరలు స్వల్ప స్థాయిలో ఉంటాయి గనుక మధుమేహం గల వారు తీసుకోవచ్చు.

6. కమలాలు
డయాబెటిస్ ఉన్న వారు విటమిన్ సి తీసుకోవడం ఎంతో అవసరం. కమలా పండు రోజుకు ఒక్కటి తీసుకున్నా ఆ మేరకు లభిస్తుంది. ఈ పండు తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయులు పెరిగిపోతాయన్న భయం అక్కర్లేదు. చక్కెర స్థాయులు తక్కువే.

7. నేరేడుపండ్లు
ఈ పండ్లు మధుమేహాన్ని మంచిగా కంట్రోల్ చేయగలవని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. నేరేడు పండు తిన్న తర్వాత అందులో ఉండే గింజలను పౌడర్ చేసుకుని తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. ఎందుకంటే గింజల్లో గ్లూకోసైడ్ ఉంటుంది గనుక. ఈ గ్లూకోసైడ్ ఆహారంలోని పిండి పదార్థాలు గ్లూకోజ్ గా మారకుండా అడ్డుకుంటుంది.

8. ఉసిరి
ఉసిరిలో పుష్కలంగా విటమిన్ సి, ఫైబర్ వుంటాయి. కనుక మధుమేహం ఉన్న వారు ఉసిరితో చేసిన వంటలు తీసుకోవడం మంచిది.

   Politics

   Lifestyle