నేచురల్ స్టార్ నాని, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన కుటుంబ కథా చిత్రం ‘టక్ జగదీష్’. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ఫిబ్రవరి 24 నాని జన్మదినోత్సవం సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
1:36 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్లో ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, లవ్ అన్నీ చూపించేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఫ్యామిలీ ఎమోషన్స్ హైలెట్‌గా ఈ చిత్రం రూపొందుతున్నట్లు అర్థమవుతోంది. నాని మేకోవర్, బాడీ లాంగ్వేజ్ బాగుంది. టీజర్ అంతా కూడా బ్యాగ్రౌండ్ సాంగ్ వినిపిస్తుండగా కొనసాగుతుంది. ఈ టీజర్‌ను ట్వీట్ చేసిన నాని.. ‘‘పండగకి వచ్చే సినిమాలు కొన్ని.. పండగలాంటి సినిమాలు కొన్ని’’ అని పేర్కొన్నారు.
ఈ చిత్రంలో నాజర్, జగపతి బాబు, రావు రమేష్, వీకే నరేష్, డానియల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవదర్శిని, ప్రవీణ్.. ఇలా భారీ తారాగణమే ఉంది. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చగా.. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా, వెంకట్ ఫైట్ మాస్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 ఏప్రిల్ 23న ‘టక్ జగదీష్’ ధియేటర్లలో విడుదల కానుంది.