‘బాహుబలి’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఎప్పుడూలేనంత దూకుడుతో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం నాలుగు భారీ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. రాధాకృష్ణ దర్శకత్వంలో రానున్న "రాధేశ్యామ్" ఫైనల్ షూటింగ్ జరుపుకుంటుండగా, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ "సలార్" రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది.
ప్రభాస్ కెరీర్ లో 20 వ సినిమాగా తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ జూలై 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇక ఇప్పటికే టీజర్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. త్వరలో టీజర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ క్లాసిగా కనిపించబోతున్నాడు. ప్రభాస్ ఈ మధ్యనే ఓం రౌత్ దర్శకుడిగా "ఆదిపురుష్" షూటింగ్ కూడా మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ రాముడి అవతారం ఎత్తనున్నాడు. ఇదిలా వుంటే ఈ సినిమా సెట్స్‌లో ప్రభాస్‌ను కలిసిన ఓ అభిమాని హీరోతో ఫొటో దిగాడు. వెంటనే దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో కళ్లజోడు, తలకు క్యాప్ పెట్టుకుని ఉన్న ప్రభాస్ కొత్త లుక్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారగా ట్విటర్లో #Adipurush హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
'ఆదిపురుష్' సినిమా విషయానికి వస్తే ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా, సైఫ్ అలీ ఖాన్ లంకేశ్(రావణుడు)గా కనిపించనున్నారు. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి సనన్‌ను సీతగా ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 11న 'ఆదిపురుష్' విడుదల కానుంది.